దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 8,86,263 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 8,306 కొత్త కేసులు నమోదవ్వడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 211 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.73లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 8,834 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.40 కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 98,416కి చేరింది.

దేశంలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించినట్టు కనిపిస్తున్నా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే చాపకింద నీరులా ఇప్పటివరకు ఆ వేరియంట్‌కు చెందిన 21 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేనని ఇప్పటివరకు చెప్తూ వస్తున్న నిపుణులు ఇప్పుడు వచ్చే రెండు నెలల్లో స్వల్పస్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.