వరంగల్‌లో 2వేల పడకలతో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తూ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో 15 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్థులతో ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టి అత్యాధునిక వైద్య సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే వరంగల్‌ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు అందుబాటులో ఉంది. వరంగల్‌లో 215.35 ఎకరాల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలతో కూడిన హెల్త్‌ సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అందులోని 15 ఎకరాల్లో ప్రస్తుతం 24 అంతస్థుల భవనం నిర్మించనున్నారు.