కిట్టీపార్టీలతో సంపన్న కుటుంబాల మహిళలను ఆకట్టుకుని, వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన శిల్పా చౌదరి కేసులో పెద్దల సొత్తు రికవరీపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

శిల్పాచౌదరి బాధితుల జాబితాలో సెలబ్రిటీలు, ఐపీఎస్‌లు, ఇతర బ్యూరోక్రాట్ల బంధువులు కూడా ఉండడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశలో చర్యలు సాగుతున్నట్లు సమాచారం.

అయితే ఈ తరహా కేసులపై పోలీస్ల దగ్గరకి వెళ్తే ‘సివిల్‌ కేసుల్ని కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలి’ అంటూ సమాధానం వస్తుంది. శిల్పాచౌదరి విషయంలో తమకు ఫిర్యాదు చేసిన వారికి సంబంధించిన దర్యాప్తుతోపాటు అనధికారికంగా తమకు వస్తున్న మౌఖిక ఫిర్యాదులు, పెరుగుతున్న ఒత్తిడితో సమాంతర దర్యాప్తుపైనే దృష్టిపెట్టారని తెలుస్తోంది. అసలు కేసు పక్కన పెట్టి కొసరు కేసులపై శిల్పాచౌదరిపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

తనకు డబ్బులిచ్చిన వారిలో చాలామంది బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునే ప్రయత్నం చేశారని తొలిరోజు పోలీసు కస్టడీ సందర్భంగా శిల్ప స్పష్టం చేసింది. లోపల్లోపలే సెటిల్‌ చేయాలంటూ సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్ల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. కాగా, శిల్పాచౌదరి రెండోరోజు పోలీసు కస్టడీలో పెద్దగా వివరాలేమీ చెప్పలేదని ‘నేను అమాయకురాలిని.. రాధికారెడ్డి అనే మహిళ వద్ద పెట్టుబడి పెట్టాను. ఆమె చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేదు. నేను ఎవరికీ అన్యాయం చేయను. అందరికీ డబ్బులిచ్చేస్తా’ అని చెప్పినట్లు సమాచారం.

మరొక సందర్భంలో ఆమె 1993లో వచ్చిన ‘జెంటిల్‌మెన్‌’ సినిమా స్టోరీని వినిపించినట్లు, ఓ ఆస్పత్రి నిర్మాణం కోసం కోట్ల రూపాయలను వెచ్చించినట్లు, తమ ఇంట్లో చాలా ఆధారాలున్నాయని శిల్ప చెప్పినట్లు తెలిసింది. దాంతో పోలీసులు ఆమెతోపాటు ఇంటికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. హవాలా డబ్బులపైనా పోలీసులు ఎలాంటి సమాధానాలను రాబట్టుకోలేదని సమాచారం. రెండు రోజుల కస్టడీ ముగియడంతో శిల్పాచౌదరిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

రాధికారెడ్డి అనే పేరును శిల్ప వెల్లడించలేదని పోలీసులు చెబుతుండగా శనివారం రాత్రి రాధికారెడ్డి అనే పేరున్న మహిళ ఒకరు మాదాపూర్‌ డీసీపీని కలిశారు. శిల్పతో ఎలాంటి సంబంధం లేదని, తన పేరు మీడియాలో చక్కర్లు కొడుతోందని ఫిర్యాదు చేశారని, మీడియాను నియంత్రించాలని ఆమె కోరినట్లు తెలిసింది.