జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ పునర్‌వ్యవస్థీకరణకు కొంతకాలంగా సాగుతున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ కంపెనీ నుంచి విద్యుత్తు, రోడ్డు ప్రాజెక్టులు, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులను విడదీసి జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ అనే పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఇటీవల ఎన్‌సీఎల్‌టీ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద విమానాశ్రయాల వ్యాపారం మొత్తం ఉంటుంది. దీనికి ఈ నెల 12వ తేదీని ‘రికార్డు తేదీ’ గా నిర్ణయించారు. ఆ రోజు నాటికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వాటాదార్లుగా ఉన్నవారికి, ప్రతి 10 జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేర్లకు (రూ.1 ముఖ విలువ), ఒక జీపీయూఐఎల్‌ షేరు (రూ.5 ముఖ విలువ) కేటాయిస్తారు. రెండు కంపెనీల మధ్య ఆస్తులు, అప్పుల విభజన జరుగుతుంది. విభజన తర్వాత విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణకు ఒక కంపెనీ, పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రెండో కంపెనీ పరిమితం అవుతాయి. తద్వారా ఆయా వ్యాపార విభాగాల మీద దృష్టి కేంద్రీకరించి సత్వర వృద్ధి నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాల విభాగంలో శరవేగంగా విస్తరించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విభజన ఉపయోగకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రస్తుతం పలు దేశీయ విమానాశ్రయాల ప్రాజెక్టులు నిర్వహించడమే కాకుండా, విదేశాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడుతోంది. పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఈ విభాగంలో ఇంకా విస్తరించే అవకాశం ఉంది. అదే విధంగా పట్టణ మౌలిక సదుపాయాల విభాగంలో కీలక పాత్ర పోషించవచ్చు. ఇటీవల కాలంలో రైల్వేస్టేషన్ల నిర్మాణం- నిర్వహణ, ప్రైవేటు రైళ్ల నిర్వహణపై జీఎంఆర్‌ గ్రూపు అవకాశం కోసం ఎదురు చూస్తుంది. పట్టణ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తున్నందున పలు కొత్త ప్రాజెక్టులను ఈ కంపెనీ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.