సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులకు ఒక విచిత్ర సంఘటన జరిగింది. శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కరణ్ అజహర్ అనే బాలుడు స్కూటీపై బ్యాగులు వేసుకుని పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో పాత బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు దొరికాడు.

బాలుడిని ఆపి నువ్వు ఎక్కడికి వెళ్లావు అని ట్రాఫిక్ ఆర్‌ఎస్ఐ సాయి ప్రసాద్ ప్రశ్నిస్తే ప్రతిరోజూ పాఠశాలకు ఇదే బండి మీద వెళ్తానని ఈ బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదని మీరు ఆపకూడదు, మా నాన్న ఎంపిటిసి అని పోలీసులను ఎదురు ప్రశ్నించాడు. విషయం అంతా విన్న ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు.

వెంటనే తేరుకున్న పోలీసులు తండ్రికి ఫోన్ చేసి కౌన్సెలింగ్ నిర్వహించి పిల్లలకు స్కూటీ ఇవ్వకూడదని, ఏ చట్టంలో కూడా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపాలని లేదని, మరోసారి ఇదే విధంగా జరిగితే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. సదరు బాలుడి బంధువులను పిలిపించి బాలుడిని స్కూటీని వారికి అప్పగించడం కొసమెరుపు.