ఢిల్లీ శివార్లలో దారుణ ఘటన
నోట్లో గుడ్డలు కుక్కి హత్య
అంతకు ముందే పార్టీ ఇచ్చిన నరేంద్ర నాథ్
కేసును ఛేదిస్తామన్న పోలీసులు

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ దగ్గరి బంధువులు యూపీలోని గ్రేటర్ నోయిడాలో దారుణ హత్యకు గురయ్యారు. కమల్ నాథ్ కజిన్ నరేంద్ర నాథ్ (70), ఆయన భార్య సుమన్ (65), శనివారం ఉదయం తమ ఇంట్లోనే చంపబడ్డారు. ఇంటి బేస్ మెంట్ లోని బట్టల కుప్పలో నరేంద్ర నాథ్, తొలి అంతస్తులోని ఓ గదిలో సుమన్ మృతదేహాలు కనిపించాయి. నరేంద్ర నోట్లో గుడ్డలు కుక్కి, కట్టి పడేసి హత్య చేసినట్టు కనిపిస్తుండగా, సుమన్ ను కొట్టి, ఆపై ఛాతీపై తుపాకితో కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది.

పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ప్రస్తుతం నరేంద్రనాథ్, ఢిల్లీలో స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేస్తూ, గ్రేటర్ నోయిడాలోని ఆల్ఫా 2 సెక్టారులో మూడంతస్తుల భవంతిలో ఉన్నారు. ఆయన వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నారు. సుమన్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నారు. నరేంద్ర నాథ్ తరచూ, తన వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇంట్లోని బేస్ మెంట్ లో చిన్న చిన్న వ్యాపారులు, కూలీలను కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన ఇంటికి కొందరిని ఆహ్వానించారు.

అదే రోజు తన కుమార్తెకు ఫోన్ చేసిన సుమన్, బేస్ మెంట్ లో పార్టీ జరుగుతోందని, వచ్చిన వారు మద్యం తాగుతున్నారని, అందువల్ల తాను అక్కడికి వెళ్లలేదని చెప్పారు. ఈ పార్టీ తరువాత వారిద్దరూ మృతదేహాలుగా కనిపించడంతో పార్టీకి వచ్చిన వారే ఈ హత్యలు చేసి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఇంట్లోని రూ. 25 వేలు, నగలు కనిపించలేదని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్నారు. ఇంటి బేస్ మెంట్ లో మద్యం సీసాలు, నూడుల్స్, వైన్ గ్లాసులు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని, కేసును సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు