సోషల్ మీడియా… ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకునే వేదిక. ఆధునిక సాంకేతికత తీసుకువచ్చిన అద్భుతం ఇది. సరిగ్గా వినియోగించుకుంటే సగటు పౌరుడి చేతిలో ఆయుధం సోషల్ మీడియా. సమాజంలో పేరుకుపోయిన మకిలిని కడిగేసేందుకు ఉపయోగపడాల్సిన సాధనం ఇది. అవినీతి, అక్రమాలు బయటపెట్టేందుకు, పౌరులే పాత్రికేయులుగా పని చేసేందుకు అవకాశం ఇది. ఇంత మంచి ఉన్న సోషల్ మీడియాను ఇప్పుడు చెడు ఏలుతోంది. రాజకీయం, ఫ్యాన్ వార్ బురదలో సోషల్ మీడియా కూరుకుపోతోంది.
ముఖ్యంగా, తెలుగునాట ఇది మరీ విజృంభించి సోషల్ మీడియా అంటే వెగటు పుట్టించే స్థాయికి చేరుకుంది. ముందుగా రాజకీయాలు సోషల్ మీడియా వేదికలను బురదగుంటలు చేశాయి. ఒకసారి ఇందులోకి పొరపాటున అడుగుపెట్టినా ఒళ్లంతా బురద పూసుకోవడమే కానీ కడుక్కోవడం కుదరని పని. గత పదేళ్లుగా రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర విపరీతంగా పెరిగింది. పార్టీలు ప్రచారం చేసుకునేందుకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ సైట్లను వేదికలుగా చేసుకుంటున్నాయి.
కేవలం సోషల్ మీడియా కోసమే ప్రత్యేకంగా పార్టీ కమిటీలను వేసుకుంటున్నాయి. బూత్ స్థాయి నుంచే ఈ కమిటీలను నియమించుకుంటున్నాయంటే పార్టీలు ఎంతగా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తమ పార్టీల ప్రచారం చేసుకున్నంత వరకూ ఎక్కడా ఇబ్బంది ఉండదు. కానీ, అవతలి పార్టీలకు వ్యతిరేక ప్రచారం మొదలైనప్పుడే ఇక సోషల్ వార్ మొదలవుతుంది. మొదట, ఇరు పార్టీల సోషల్ మీడియా శ్రేణులు రంగంలోకి దిగి ఒక పార్టీని, మరొక పార్టీ వారు తిట్టుకుంటారు. కామెంట్ల రూపంలో మొదలయ్యే చర్చ బండబూతులు తిట్టే వరకు వెళ్లిపోతోంది. ముందు నాయకులను, ఆ తర్వాత వారి కుటుంబసభ్యులను తిట్టడం ప్రారంభిస్తారు.
నాయకుల స్థాయిని సైతం గుర్తించకుండా రెచ్చిపోతారు. అసభ్యకరంగా, అభ్యంతకర రీతిలో నాయకులకు మారుపేర్లు పెట్టి దూషించడం ప్రారంభిస్తారు. తమ నాయకుడినే తిడతారా అంటూ మరో పార్టీ వారు రంగంలోకి దిగి ఎదుటి పార్టీ నాయకుడిని తిట్టడం ప్రారంభిస్తారు. నాయకుల ఇళ్లలోని ఆడవారిని సైతం వదలకుండా అసభ్యంగా దూషిస్తారు. అగౌరవపరుస్తారు. నిజానికి, అన్ని పార్టీలూ సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకున్నందున, వీటిలో పని చేసే వారే మొదట ఈ బురదయుద్ధాన్ని ప్రారంభిస్తారు.
కానీ, క్రమంగా ఆయా పార్టీల సానుభూతిపరులు మొదట తెలియకుండానే ఏదైనా కామెంట్ చేయడమో, షేర్ చేయడమో చేసి ఇందులో ఇరుక్కుపోతారు. ఒకరినొకరు బండబూతులు తిట్టుకోవడం వరకు వెళుతుంది ఈ వ్యవహారం. అధికారంలో ఉన్న పార్టీ తమ నాయకులను సోషల్ మీడియాలో దూషించిన వారిపై కేసులు పెడుతుంది. ఒకరిద్దరిని అరెస్టు చేయిస్తుంది. తద్వారా ఇతరులను బయపెట్టాలని అనుకుంటుంది. కానీ, ప్రతిపక్ష పార్టీ పెద్దలు అరెస్టైన తమ వారికి అండగా ఉంటారు. తమ వారు చేసిన తప్పులను సమర్థిస్తారు. దీంతో మిగతా వారు ఇంకా రెచ్చిపోతారు.
రాజకీయాలే కాకుండా హీరోల అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్ కూడా సోషల్ మీడియాను పెంట చేస్తున్నాయి. అభిమానులు తమ హీరోలకు అనుకూలంగా సోషల్ సైట్లలో పోస్ట్‌లు పెడుతుంటారు. హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తుంటారు. అక్కడి వరకు ఉంటే బాగుంటుంది. కానీ, అవతలి హీరోలను కించపరుస్తారు. నటించడం రాదంటారు. అసభ్యంగా దూషిస్తారు. దీంతో ఆ హీరో ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఈ హీరోను బూతులు తిడుతుంటారు.
రాజకీయ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేస్తున్నాయి. వీళ్లే పేజ్‌లు ప్రారంభించి, ఫేక్ అకౌంట్లు పెట్టుకొని అవతలి పార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తుంటారు. ఇది తెలియని పార్టీల సానుభూతిపరులు, పౌరులు అనవసరంగా ఈ గొడవల్లోకి చేరి మనశ్శాంతిని కోల్పోతారు. ఇదంతా చూసే సాధారణ ప్రజలకు కూడా సోషల్ మీడియా అంటేనే వెగటు పెడుతోంది. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
డమ్మీ పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం వీటిల్లో సులభం. కేసులు పెట్టడం, కొంత మందిని అరెస్టు చేయడం ద్వారా ఇది ఆగిపోవడం కుదరని పని. ఫేక్ అకౌంట్ల ఏర్పాటుకు అవకాశం ఉండకూడదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిపై నియంత్రణ ఉండాలి. సోషల్ మీడియా యూజర్లు చేసే పోస్ట్‌లు, కామెంట్లు చట్ట విరుద్ధంగా ఉండొద్దు. ఉంటే, చర్యలు ఉంటాయేమో అనే భయం ఉండాలి. అప్పుడే సోషల్ మీడియా ప్రక్షాళన జరుగుతుంది.