టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్షకు హాజరైన ఆయన తన పాదయాత్ర ప్రారంభించారు. రాజీవ్ రైతు భరోసా యాత్రగా తన కార్యక్రమానికి పేరు మార్చి చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చి, పాదయాత్ర మొదలుపెట్టారు. అచ్చంపేట సభ ముగియగానే రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా దీక్షలు ప్రారంభించారు. ఇటీవల ఆయన ఆర్మూర్‌లో దీక్ష చేయగా ఇవాళ అచ్చంపేటలో దీక్షకు దిగారు. ఈ దీక్షలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… రైతులకు తెలంగాణ రాష్ట్రంలో మరింత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలని కోరారు.
రేవంత్ రెడ్డి దీక్షలను యాత్రగా మార్చాలని, హైదరాబాద్ వరకు పాదయాత్రగా బయలుదేరాలని కోరారు. సీతక్క చేసిన సూచనకు రేవంత్ రెడ్డి సరేనన్నారు. దీంతో సభ ముగియగానే ఆయన సభకు వచ్చిన రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ఎటువంటి ప్రణాళిక, ఏర్పాట్లు లేకుండా రేవంత్ రెడ్డి సుమారు 250 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.