మహిళా దినోత్సవం దగ్గరలో ఉండగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పుఇచ్చింది.
కారుణ్య నియామకంలో పెళ్లైన కుమార్తెకూ హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇలాంటి వ్యవహారంలో అవావిహత అనే పదమే రాజ్యాంగ విరుద్ధమంటూ ఆర్టీసీ ఇచ్చిన సర్క్యులర్ ను కొట్టేసింది. పైగా పెళ్లైన కుమారుడు అర్హుడైతే పెళ్లైన కుమార్తె ఎందుకు అర్హురాలు కాదని ప్రశ్నించింది. ఇక వివరాలలోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తూ సర్వీసులో ఉండగానే పెంటయ్య 2009 మార్చిలో మరణించారు. ఆయన సర్వీసులోనే ఉన్న కారణంగా కారుణ్య నియామకం కింద తన కుమార్తెకు సీహెచ్.దమయంతికి ఉద్యోగం ఇవ్వాలని చిన్నమ్మ అనే మహిళ దరఖాస్తు చేసుకున్నారు. కానీ అప్పటికి తనకు పెళ్లయిందన్న కారణంతో అధికారులు తనను తిరస్కరించారంటూ 2014లో దమయంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ఆర్టీసీ కూడా సవాల్ చేస్తూ గత ఏడాది మేలో ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మృతుల భార్య/భర్త లేదా కుమారుడు లేదా పెళ్లికాని కుమార్తె మాత్రమే అర్హులని పేర్కొంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైందన్న కారణంతో ఆమెను తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం సరికాదని, కారుణ్య నియామకం విషయంలో అవివాహిత అనే పదమే రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. పిటిషనర్ దమయంతికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. 1999లో జారీ చేసిన 350 జీవో ప్రకారం ఒక కూతురు ఉండి ఉంటే వివాహిత అయినా సరే ఉద్యోగం కల్పించాలంటూ 2003లో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరొకసారి గుర్తు చేశారు.

కారుణ్య నియమాకాల్లో కుమారుడు ఎంతో కుమార్తె కూడా అంతేనని జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యానించారు. కుమార్తెకు పెళ్ళైతే తల్లిదండ్రులతో సంబంధం లేదనడం సరి కాదని, ఆమెకు ఆ కుటుంబంతో విడదీయరాని బంధం ఉంటుందని, కుటుంబ బాధ్యతలు మోస్తున్నవారు, తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు కూడా చేస్తున్నవారు ఉన్నారని జస్టిస్ దేవానంద్ గుర్తు చేశారు. అవివాహితకే కారుణ్య నియామకం అనే నిబంధన ఇకపై చెల్లదని ఆయన స్పష్టం చేశారు.

పిల్లలు పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేదానితో సంబంధం లేకుండా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో వారు భాగమే. కుమారులు, కుమార్తెలకు తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టంలో ‘పిల్లలు’ అనే పదానికి నిర్వచనం పరిశీలిస్తే అందులో కుమారుడు, కుమార్తెతో పాటు మనవడు, మనవరాలు కూడా వస్తారని తీర్పులో పేర్కొన్నారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు కుమార్తెకు పెళ్లయిందా? లేదా అనే తేడాను పార్లమెంటు పేర్కొనలేదని, పెళ్లయినా తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే బాధ్యతను ఈ చట్టం తీసేయలేదు. కావున తల్లిదండ్రుల అవసరాలు తీర్చే బాధ్యత పెళ్లయిన కుమార్తెలపైనా ఉంది. ప్రస్తుత కేసులో తండ్రి చనిపోయాక వితంతువైన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఏకైక కుమార్తె అయిన పిటిషనర్‌పై ఉందని, ఆమెకు ఉద్యోగం కోసం దరకాస్తు చేసుకునే అవకాశం ఉందని తీర్పులో పేర్కొన్నారు.