కరోనా పట్ల సర్వత్రా అలసత్వం ప్రదర్శించడం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు మరియు శాస్త్రవేత్తలు. భారత్ లో కరోనా వైరస్ మళ్లీ విజృభిస్తోంది. గడిచిన వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ, పాత రికార్డులను తిరగేస్తోంది. ఒకే రోజులో కొత్త కేసుల విషయంలో రెండు నెలల తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. కొత్త కేసులు పెరగడంతో యాక్టివ్ కేసులూ పెరుగుతూ, మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7.37లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు జరపగా, కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి అని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. గడిచిన ఐదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ, ఇవాళ రెండు నెలల గరిష్టానికి చేరింది. ఈ ఏడాది జనవరి చివర్లో ఒక రోజు కొత్త కేసులు 19 వేలకు చేరువగా నమోదుకాగా, మళ్లీ నిన్న (మార్చి 6న) కూడా అదే స్థాయిలో కేసులు వచ్చాయి. కొత్తవాటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1కోటి, 12లక్షల,10వేల, 799కి పెరిగాయి. ఇక మరణాల విషయానికొస్తే, గడిచిన 24 గంటల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,57,756కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.41 శాతంగా కొనసాగుతోంది. గడిచిన వారం రోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్టివ్ కేసుల సంఖ్య 1,84,523 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గడిచిన రెండు నెలల్లో కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండగా, గడిచిన వారం రోజుల్లో మొత్తం రివర్స్ అయిపొయింది. నిన్న ఒక్కరోజే కొత్తగా 18,711 కేసులు నమోదుకాగా, కొత్తగా 14,392 మంది కొవిడ్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,08,68,520కు చేరింది. మొన్నటిదాకా దాదాపు 98 శాతంగా ఉన్న రికవరీ రేటు క్రమంగా పడిపోతోంది. దేశంలో రికవరీ రేటు 96.95 శాతానికి తగ్గిపోయిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇటీవల రెండో దశ టీకా ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14లక్షల మంది టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 2,09,22,344కి చేరింది.