తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని ప్రజలను నమ్మించి నట్టేట ముంచేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన విషయం పాఠకులకు విదితమే! ఈ సంఘటన పై విచారిస్తున్న పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
మల్టీలెవెల్ మోసాలతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాలకు అడ్డుకట్టవేయడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రజల బలహీనతలే వారి పెట్టుబడి. వారి దందాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు తెరలేపి ఏడేళ్లలో రూ.1,500 కోట్లు దోచేసిన ఇండస్ వివా సంస్థ గుట్టురట్టయ్యింది. ఆ సంస్థ నిర్వాహకులు అభిలాష్ థామస్, ప్రేమ్‌కుమార్‌తో సహా 24 మందిని హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

నిందితుల్లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులూ ఉండటం శోచనీయాంశం. ఈ ముఠా చేతిలో మోసపోయిన వ్యక్తి ఫిర్యాదుతోనే ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్లో ఇండస్ వివా సదస్సు నిర్వహిస్తున్నట్టు పోలీసులు సమాచారం అందుకోవదాంతో అక్కడకు చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ దేశవిదేశాల్లో 10 లక్షల మందిని మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి, రూ.20 కోట్ల నగదును స్తంభింపజేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు బెంగళూరుకు చెందిన అభిలాష్ థామస్ పదేళ్ల క్రితం ఆమ్వేలో పనిచేసి అనంతరం మల్టీలెవల్ మార్కెటింగ్ తరహాలో కాస్మోటిక్స్ అమ్మే మోన్వీ అనే అమెరికా కంపెనీలో చేరాడు. అక్కడ పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్‌తో ఏర్పడిన పరిచయంతో ఏడేళ్ల కిందట బెంగళూరులో ఇండస్ వివా హెల్త్‌సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. ఐ-పల్స్, ఐ-గ్లో, ఐ-స్లిమ్, ఐ-కాఫీ పేరుతో నేచురోపతి, ఆయుర్వేద సంరక్షణ ఉత్పత్తుల విక్రయానికి ప్లాన్ వేసి, బెంగళూరుకు సమీపంలోని నేలమంగళలోని ఆలివ్ హెల్త్ సైన్సెస్ కంపెనీని సంప్రదించి తమకు అవసరమైన ఉత్పత్తులు తయారు చేయమన్నారు. దీనికి ఆయుష్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే ప్రచారం మొదలుపెట్టారు. సంతానం లేనివారికి తమ ఉత్పత్తుల ద్వారా పిల్లలు పుడతారని, లావుగా ఉన్నవారు సన్నబడతారని ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోను ప్రచారం చేశారు.

ఇండస్ వివాలో రూ.12,500 కట్టి ముందుగా సభ్యత్వం నమోదుచేసుకోవాలి. భర్త సభ్యుడైతే భార్య కూడా సభ్యురాలైనట్లే. ఒకరిని చేర్పిస్తే వంద పాయింట్లు, డబ్బున్న వ్యక్తులను ఉచ్చులోకి లాగేందుకు రూ.1.50 లక్షల సభ్యత్వాన్నీ ప్రారంభించారు. ప్రోత్సాహకాలుగా నగదుతో పాటు ఖరీదైన కార్లు, మలేసియా, మకావ్ దీవులు, అమెరికా ట్రిప్‌లకు పంపించేవారు. తమ ఉత్పత్తులకు వచ్చిన అవార్డులను ప్రముఖుల చేతుల మీదుగా తీసుకున్నామంటూ ఒక మ్యాగజైన్‌ను వివా వైబ్స్ పేరుతో ప్రచురిస్తున్నారు. ఇందులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కేరళ మాజీ మంత్రి థామస్‌ల ఫొటోలూ కూడా ఉండడం గమనార్హం!