చేదు వ్యసనాలకు బానిసై జల్సాల కోసం ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బులు
వసూలు చేస్తున్న ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్పరిధిలోని భోలక్‌పూర్ రంగానగర్‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం రంగానగర్‌లో నివాసం ఉంటున్న ఫాయాజ్ అలియాస్ ఫర్వేజ్ (23) చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు బానిసగా మారి గంజాయి, వైట్నర్ తాగుతూ బస్తీ ప్రజలను, వ్యాపారులను తన అవసరాల కోసం రూ. 500, రూ. 1,000, రూ. 2,000 చొప్పున బెదిరించి తీసుకునేవాడు. ప్రతిసారి ఎవరినో ఒకరిని బెదిరించి డబ్బులు తీసుకోవడం ఫాయాజ్కు అలవాటుగా మారింది. రంగానగర్‌కు చెందిన సద్దాంహుస్సేన్ను పలుమార్లు బెదిరించి, డబ్బులు తీసుకున్నాడు.
శుక్రవారం రాత్రి రంగానగర్‌లో ఓ శుభకార్యం జరుగుతుండగా, అక్కడికి సద్దాం హుస్సేన్ తన స్నేహితుడైన మోటా గౌస్‌తో కలిసి వచ్చాడు. రాత్రి 10 గంటలకు బారాత్ జరుగుతుండగా సద్దాం హుస్సేన్ వద్దకు ఫాయాజ్ వచ్చి రూ. 2 వేలు కావాలని అడిగాడు. డబ్బులు లేవని సద్దాంహుస్సేన్ చెప్పడంతో కోపంతో ఉగిపోయిన ఫాయాజ్ తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సద్దాం హుస్సేన్ ఫాయాజ్ చేతిలోని కత్తిని లాక్కొని, స్నేహితుడైన మోటా గౌస్ సహకారంతో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం జరిగి ఫాయాజ్ అక్కడికక్కడే పడిపోయాడు. ముషీరాబాద్ పోలీసులు వచ్చి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఫాయాజ్ చనిపోయాడని నిర్ధారించారు. పోలీసులు సద్దాంహుస్సేన్, మోటాగౌస్లపై హత్య కేసు నమోదు చేశారు. ఫాయాజ్ మృతి చెందడంతో సద్దాం హుస్సేన్ ఫరారయ్యాడని సీఐ మురళీకృష తెలిపారు