లాక్‌డౌన్ కారణంగా భారతీయ రైల్వే అన్ని సేవలను నిలిపివేసిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే! అప్పుడు నిలిపివేసిన సేవల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రారంభిస్తోంది. ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరించడంతోపాటు యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో టికెట్ బుకింగ్ ప్రారంభించిన రైల్వే రిటైరింగ్ రూమ్స్‌ను నిర్వహించేందుకు అనుమతిచ్చింది.

మొదట కొన్ని స్పెషల్ ట్రైన్స్ మాత్రమే ప్రకటించిన రైల్వే ఆ తర్వాత రైళ్ల సంఖ్యను పెంచుతూ వస్తోంది. మరోవైపు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తోంది రైల్వే. యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో టికెట్ బుకింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో పాటు ఇటీవల రైళ్లల్లో ఇ-కేటరింగ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించేందుకు అనుమతిచ్చి, ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్ సేవల్ని మొదలు పెట్టింది. ఇప్పుడు రిటైరింగ్ రూమ్స్, రైల్ యాత్రి నివాస్, హోటళ్లను తెరిచేందుకు భారతీయ రైల్వే అనుమతి ఇచ్చింది.

గత సంవత్సర కాలంగా లాక్‌డౌన్ కారణంగా ఈ సేవలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక పరిస్థితులు, ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్స్‌ని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్ తెరవడంపై నిర్ణయం తీసుకునే అధికారాలను జోనల్ రైల్వేస్‌కి అప్పగించింది.

ప్రస్తుతం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్ రైల్వే సేవలు కూడా దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. రిటైరింగ్ రూమ్స్ తెరవాలన్న విజ్ఞప్తులు ప్రయాణికుల నుంచి రావడంతో, రిటైరింగ్ రూమ్స్, రైల్ యాత్రి నివాస్, హోటళ్లు తెరిచేందుకు భారతీయ రైల్వే అనుమతి ఇచ్చింది. వీటిని ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC నిర్వహిస్తోంది. రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్‌ను రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఏసీ, నాన్ ఏసీ సింగిల్, డబుల్, డార్మిటరీ లాంటి గదులు ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌లోనే బుక్ చేయొచ్చు. కనీసం 3 గంటల నుంచి గరిష్టంగా 48 గంటల వరకు రైల్వే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయడానికి ఈ కింద్ స్టెప్స్ ఫాలో కావాలి.

ముందుగా ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Retiring Room ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆ పీఎన్ఆర్ నెంబర్‌లో సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ ఉంటాయి. మీరు రైలు ఎక్కడానికి ముందు రిటైరింగ్ రూమ్ బుక్ చేయాలంటే సోర్స్ స్టేషన్ ఎంచుకోవాలి. రైలు దిగిన తర్వాత రూమ్ కావాలంటే డెస్టినేషన్ స్టేషన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత చెక్ ఇన్ డేట్, చెక్ ఔట్ డేట్, బెడ్ టైప్, ఏసీ స్టేటస్, కోటా లాంటివి సెలెక్ట్ చేయాలి. చివరగా Check Availability పైన క్లిక్ చేయాలి. రూమ్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేయాలి. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆఫ్‌లైన్‌లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయాలనుకుంటే రైల్వే స్టేషన్‌లో ఎంక్వైరీ చేయాలి. రిటైరింగ్ రూమ్ బుక్ చేసే సమయంలో పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు మీ ట్రైన్ టికెట్ స్టేటస్‌ని వివరించాలి.

భారతదేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, గద్వాల, కామారెడ్డి, కాజిపేట, నిజామాబాద్, రామగుండం, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఆదోని, అనంతపూర్, అన్నవరం, అరకు, చీరాల, కడప, చిత్తూరు, ఏలూరు, గుంతకల్, గుంటూరు, కర్నూలు టౌన్, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, పలాస, రేణిగుంట, సామర్లకోట, సూళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్, హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిలో దేనినైనా బుక్ చేస్కోవచ్చు.