కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా చాలా రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు పెరిగాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఇండోర్ పోలీసులు ఓ వ్యక్తిని మాస్కును ధరించనందుకు తీవ్రంగా కొట్టడం సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. “ఆస్పత్రిలో ఉన్న మా నాన్నకు ఆహారం తీసుకు వెళ్తున్నప్పుడు నా మాస్క్ జారడంతో అప్పుడు పోలీసులు నన్ను స్టేషన్‌కు రమ్మని బలవంతం చేయడంతో తరువాత వస్తానని వారిని అభ్యర్థించాను. ఆ వెంటనే ఆ ఇద్దరు పోలీసులు నన్ను కొట్టడం ప్రారంబించారు” అని ఆ వ్యక్తి చెప్పినట్లు ఒక వార్త ప్రచురితమైంది.

పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్న ఆ వ్యక్తిని 35 ఏళ్ల ఆటో డ్రైవర్ కృష్ణ ఖైర్‌గా గుర్తించారు. ఆయనపై దాడి చేసిన పోలీసులు కమల్ ప్రజాపత్, ధర్మేంద్ర జాట్. దాడి జరుగుతున్నప్పుడు కృష్ణ ఖైర్ కుమారుడు భయంతో అరుస్తున్నా పోలీసులు కొట్టడం ఆపలేదు. బహిరంగ ప్రదేశాల్లో ముసుగు ధరించని వారిని అరెస్ట్ చేసి తాత్కాలికంగా జైలులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీసులు తీవ్రంగా ప్రవర్తించడం మొదలైంది.