క్రైమ్ (Crime) వార్తలు (News)

అనిశా అధికారులను తప్పించుకునేందుకు స్టౌపై రూ.5 లక్షలు దహనం

అవినీతి నిరోధక శాఖ(అనిశా) డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ప్రకారం క్రషర్‌ ఏర్పాటుకు నిరభ్యంతర పత్రం (నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌-ఎన్‌వోసీ) కోసం రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ తహసీల్దారు సైదులు ఆ సొమ్ము తీసుకోవాలని మధ్యవర్తికి చెప్పారు. అనిశా అధికారులు రంగంలోకి దిగి వారిని పట్టుకోవాలని ప్రయత్నించడంతో ఆ మధ్యవర్తి ఆ నోట్లను గ్యాస్‌ స్టౌపై పెట్టి దహనం చేశాడు. సైదులును, మధ్యవర్తిని ఏసీబీ పట్టుకోగా రెవెన్యూ అరాచకాలతో ఇబ్బందిపడుతున్న పలువురు బాధితులు సంబరాలు చేసుకొన్నారు.

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరెంతకుంట తండా సర్పంచి రామావత్‌ రాములు వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో క్రషర్‌ ఏర్పాటుకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకుని జనవరి 18న జిల్లా మైనింగ్‌ అధికారులకు పత్రాలు అందజేయగా వారు జనవరి 25న రెవెన్యూ శాఖకు సమాచారం ఇచ్చారు. క్రషర్‌ ఏర్పాటుకు భూమి సర్వే చేసి ఎన్‌వోసీ ఇవ్వాలని రాములు వెల్దండ తహసీల్దారు సైదులును కలిసి దరఖాస్తు ఇవ్వగా, రూ.6 లక్షలు ఇస్తేనే సర్వే చేస్తానని చెప్పడంతో బాధితుడు రూ.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ డబ్బును వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటయ్యగౌడుకు ఇవ్వాలని తహసీల్దారు సూచించారు.

బాధితుడు ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లోని అనిశా అధికారులను ఆశ్రయించి వారి సూచనల ప్రకారం రాములు మంగళవారం డబ్బులు తీసుకుని కల్వకుర్తి పట్టణంలో నివాసముంటున్న వెంకటయ్యగౌడు ఇంటికి వచ్చారు. డబ్బు తీసుకున్న వెంకటయ్యగౌడు వెంటనే తలుపులు వేసేసుకుని వచ్చింది ఏసీబీ అధికారులు అని అనుమానం రావడంతోనే తీసుకున్న డబ్బును వంటింట్లోకి తీసుకెళ్లి స్టౌపై పెట్టి కాల్చివేసి ఆ తర్వాత తలుపు తీశాడు. అయితే అప్పటికే నోట్లు 70 శాతం కాలిపోయాయి. కల్వకుర్తితోపాటు హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో ఉన్న వెంకటయ్యగౌడు ఇంట్లో, ఎల్‌బీనగర్‌ సాయిభవాని నగర్‌లోని తహసీల్దారు సైదులు ఇంట్లో, వెల్దండ తహసీల్దారు కార్యాలయంలో సోదాలు నిర్వహించామని, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. తహసీల్దారుపై ఎ-1, మాజీ వైస్‌ ఎంపీపీపై ఎ-2గా కేసు నమోదు చేశామన్నారు.

సైదులును, వెంకటయ్యగౌడ్‌ను తహసీల్దారు కార్యాలయంలో విచారిస్తున్నప్పుడు వేరే కేసులోని బాధితులు వెల్దండ బస్సు స్టేజీ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.