వార్తలు (News)

రాత్రి కర్ఫ్యూ లాజిక్ ఏమిటి?

మహారాష్ట్ర లో రాత్రి సమయంలో చాలా మంది ప్రజలు ఇంట్లోంచి బయటకు వెళ్తారని, నైట్ క్లబ్బులకు, రెస్టారెంట్లలో తినడానికి, రాత్రి సమయంలో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారని, ప్రజలు ఇలా బయట తిరగకుండా ఉండేందుకు నైట్ కర్ఫ్యూ పెట్టినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

కాగా సాధారణ ప్రజల నుంచి అనేక సందేహాలు వస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయంపై ‘కరోనా నైట్‌ షిఫ్ట్ చేసి పగలు నిద్రపోతుందా..? అంటూ జోకులు వేస్తున్నారు. రాత్రి కర్ఫ్యూ వల్ల ప్రయోజనం ఏమిటని పలువురు డాక్టర్లను ప్రశ్నించగా “రాత్రి కర్ఫ్యూ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోలేము. కానీ ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళనగా ఉన్నామని, ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నామని ప్రభుత్వం ప్రజలకు చెప్పాలనుకుంటోంది” అని సమాధానం వస్తుంది.

మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు ద్వారా ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తుంది. కానీ ఈ తుంపర్లు రెండు మీటర్లకు మించి ప్రయాణించలేవు. అంటే వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించి, రెండు మీటర్ల దూరం పాటించడం మంచిది అని, వెంటిలేషన్ సరిగా లేని ప్రాంతాలకు జనం ఎక్కువగా వెళ్లినప్పుడు కరోనావైరస్ వ్యాపిస్తుందని, వెంటిలేషన్ ఎక్కువగా ఉన్నచోట వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలువురు డాక్టర్లు వివరిస్తున్నారు.

ప్రజలు బార్లు, రెస్టారెంట్లు వంటి వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ రాత్రి కర్ఫ్యూ పెట్టారని, పగలు ప్రజలు ఎక్కువగా పనికి వెళ్తుంటారని, రాత్రి సమయంలోనే వినోదం కోసం బయటకు వస్తారని, రాత్రిపూట కర్ఫ్యూ పెట్టడంతో పాటు ఆఫీసులను మూసేయడం, కొన్ని ఆర్థిక కార్యకలాపాలపై నిషేధం విధించడం చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఈ రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు రాత్రి కర్ఫ్యూ విధించడమే ఉత్తమం అని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.