ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మధ్య తరగతి వారు కూడా పెట్రో ధరల పెంపు కారణంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు మొగ్గు చూపుతూ వాహనాదారులు పెట్రో వాహనాల్ని పక్కనపెట్టి..ఈవీ వెహికల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా వాటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థలకు కలిసొస్తున్న అంశం.

అయితే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు ఛార్జింగ్‌ తప్పని సరి. అయితే దేశవ్యాప్తంగా ఆయా ఆటోమొబైల్‌ సంస్థలు ఛార్జింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటు నామ మాత్రంగానే ఏర్పాటు చేశాయి. దీంతో వాహనదారులు ఈవీ వెహికల్స్‌ కొంటే ఛార్జింగ్‌ కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందని వాటిని కొనుగోలు చేసేందుకు ముందు ఊగిసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వాహనదారులకు శుభవార్త చెప్తూ ఫేమ్‌ ఇండియా పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 70వేలకు పైగా పెట్రోల్‌ బంకుల్లో 22వేల ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది.

చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే స్పందిస్తూ ఎక్స్‌ప్రెస్ హైవేస్‌, హైవేస్‌, నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు, హైవేకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, దూరంతో పాటు భారీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు ప్రతి 100కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, నగరాల్లోని గ్రిడ్‌ పరిధిల్లో ప్రతి 3కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తేవాలని విద్యుత్ శాఖ గైడ్‌లైన్స్ నిర్దేశించిందన్నారు.