ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సైన్యం అధికారాన్ని కైవసం చేసుకుని ఆంగ్‌ సాన్‌ సూకీ లాంటి పలువురు కీలక నేతలను నిర్బంధించిన విషయం తెలిసిందే. వారిపై అవినీతి, ఎన్నికల్లో మోసాలు తదితర అభియోగాలు మోపి, విచారణ చేపడుతున్న క్రమంలో దేశ సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడంతోపాటు కొవిడ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగానూ సూకీకి సోమవారం మిలిటరీ జుంటా నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.

సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినందుకు రెండేళ్లు, కొవిడ్‌కు సంబంధించిన ప్రకృతి విపత్తు చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరో రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు. మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌కు సైతం ఇవే అభియోగాలపై నాలుగేళ్ల శిక్ష పడింది. ప్రస్తుతానికి వారిని ఇంకా జైలుకు తరలించలేదని, మరిన్ని అభియోగాలపై విచారణ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. వీటిలో దోషిగా తేలితే, వారికి దశాబ్దాలపాటు శిక్షపడే అవకాశం ఉంది.