ఒమిక్రాన్‌ భయాలతో ప్రజలంతా భయభ్రఅంతులకు గురవుతున్న వేళ బెంగుళూరులోని బోరింగ్‌ అండ్‌ లేడీ కర్జన్‌ ఆస్పత్రి వర్గాలు కాస్త ఊరట కలిగించే విషయం చెప్పాయి. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ బారినపడ్డ బెంగుళూరు డాక్టర్‌ (46) కోలుకున్నారని, ఆయనకు ఎటువంటి సమస్యలు లేవని, ప్రైమరీ కాంటాక్టులు అయిన ఆయన భార్య, కూతురు, మరో డాక్టర్‌ కూడా కోలుకుంటున్నారని తెలిపాయి. వారందరి చికిత్స కొరకు ఆస్పత్రిలో 60 పడకలతో ఉన్న ఓ వార్డు మొత్తం కేటాయించామని, ఆ వార్డులో మొత్తం ఆరుగురు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నాయి. మరోవైపు బాధితులకు వైద్యం అందించిన డాక్టర్లు, సిబ్బంది ఇతర వార్డులకు వెళ్లొద్దని, ఆ‍స్పత్రి పరిసరాల్లో తిరగొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

ఒమిక్రాన్‌ కూడా కోవిడ్‌-19 లాంటిదేనని, దాని గురించి భయపడాల్సింది లేదని, కోవిడ్‌ 19కు అందించిన చికిత్సనే వీరికి కూడా అందించినట్టు, మోనోక్లోనల్‌ యాంటి బాడీస్‌తో చికిత్స చేసిన తర్వాత ఒమిక్రాన్‌ బాధితుడు కోలుకున్నారని బోరింగ్‌ అండ్‌ లేడీ కర్జన్‌ ఆస్పత్రి సీనియర్‌ డాక్టర్‌ చెప్పారు.

ఆందోళనకు గురికాకుండా కోవిడ్‌-19 ప్రోటోకాల్స్‌ పాటిస్తే సరిపోతుందని, ఒమిక్రాన్‌ సోకిన డాక్టర్‌కు ఒళ్లు నొప్పులు, చలి, తేలికపాటి జ్వరం లక్షణాలు కనిపించాయని అంతేకానీ బాధితుడికి శ్వాస, రక్త సంబంధమైన ఇబ్బందులు ఏవీ తలెత్తలేదని ఆయన అన్నారు.