విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకు రావడంతో తీరం కోతకు గురై చిల్డ్రన్ పార్క్ చాలా వరకు ధ్వంసమైంది. అలల తాకిడికి పార్కు లోపల భూమి బీటలు వారింది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. పది అడుగుల వరకు భూమి కుంగిపోయి పార్కులోని బల్లలు, ప్రహరీ విరిగిపోయాయి. దీంతో జీవీఎంసీ అధికారులు పిల్లల పార్కుకు వచ్చే మార్గాన్ని బారికేడ్లతో మూసివేసి పోలీసులను కాపలా ఉంచారు.

తీరానికి సమీపంలో భారీ కట్టడాలు కారణంగా అక్కడ వచ్చే అలలు బలంగా వస్తాయని, దాంతో తీరం తరచూ కోతకు గురవుతుందని ఏయూ జీయాలజీ విభాగం ప్రొఫెసర్ ధనుంజయ్ ఒక సందర్భంలో చెప్పారు. అయితే ఇప్పుడు తుపాను నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని ఏయూ వాతావరణం విభాగం తెలిపింది. అలలు ముందుకొచ్చి కోతకు గురి కావడంతో అస్తవ్యస్తంగా మారిన బీచ్ సముద్రం ముందుకు రావడానికి వాయుగుండం ప్రభావం కారణంగా అలల ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం అని అక్కడి అధికారులు అంటున్నారు.