హైదరాబాద్ నగరానికి చెందిన శిల్పాచౌదరి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండు రోజుల పాటు తమ కష్టడీలోకి తీసుకుని విచారించగా రాధికా రెడ్డి అనే మహిళతో పాటు మరో మహిళ పేరును కూడా శిల్పా చౌదరి వెల్లడించారు. దీంతో రాధికా రెడ్డి హైదరాబాద్ నగర పోలీసులకు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేస్తూ శిల్పా చౌదరే తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆధారాలతో సహా బయటపెట్టడంతో కేసు మరొక మలుపు తీసుకుంది. అసలు శిల్పా చౌదరి ఎంత మందిని మోసం చేసిందోనన్న అనుమానంపై ఆమెను మరోమారు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నట్టు సమాచారం.

శిల్పాచౌదరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తొలుత కిట్టీ పార్టీలు నిర్వహించిన ఆమె ఆ పార్టీలకు వచ్చే అనేక మంది సినీ సెలబ్రిటీలకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే వారికి వడ్డీ చెల్లించలేదు కదా అసలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దివ్యారెడ్డి అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో హీరో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. మరెంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె దగ్గర మోసపోయారు.