సరైన వేళకు తగినంత ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతే మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే మనం రోజు తినే ఆహారంగానీ, తినే సమయంగాని సరైన సమయంలో సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మనం తినే ఆహారంలో ఫాస్ట్ ఫుడ్ జీర్ణంకాక, అధిక బరువు పెరగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక మనం తినే ఆహారాలను జీర్ణం చేయడంతోపాటు వాటిలో ఉండే పోషకాలను మన శరీరానికి అందేలా చూడడంలో జీర్ణ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. దీంతోపాటు ఆ ఆహార పదార్థాల్లో ఉండే వ్యర్థాలను కూడా జీర్ణవ్యవస్థ బయటకు పంపుతుంది.

అదే జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే గ్యాస్‌, అసిడిటీ, కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు తదితర సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి కొన్ని ఆహారాలను నిత్యం తీసుకుంటే జీర్ణం బాగా అవడమే కాదు, ఆయా జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. యాపిల్ పండ్లలో పుష్కలంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. కనుక నిత్యం యాపిల్ పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. సోంపు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణాశయంలో ఆహారం కదలికను సరిచేస్తుంది. దీంతో కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారానికి ముందు కొద్దిగా అల్లం రసం తీసుకుంటే మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే వికారం, వాంతులు తగ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ రాకుండా ఉంటాయి. భోజనానికి ముందు పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది, విరేచనాలు ఆగుతాయి.

ఇక అరటిపండు లో సహజ యాంటాసిడ్ ఉంటుంది. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. అరటిపండు మీ శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.

ఓట్స్ తేలికపాటి ఆహారం కాబట్టి దీనిని ఖాళీ కడుపుతో తినవచ్చు. సాల్టెడ్ ఓట్స్‌లో ఎలాంటి మసాలా దినుసులను కలుపకుండా తినాలి ఎందుకంటే ఇది ఉదర సమస్యలను మరింత పెంచుతుంది. స్వీట్ ఓట్స్ పాలలో వండుతారు. దానిని నీటిలో కూడా ఉడికించవచ్చు. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది.