కరోనా నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను జనవరి 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని, విద్యార్థులు హాస్టల్‌ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని, హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు.

ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్‌ పీజీఈసెట్‌ ఈ నెల 6 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు సెట్‌ కన్వీనర్‌ పి.రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువుంటుందని వెల్లడించారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్‌టైమ్‌ చాన్స్, బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్‌లాగ్, వన్‌టైమ్‌ చాన్స్‌ ఫలితాలను బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్‌ శ్రీనగేశ్‌ తెలిపారు.

రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ-2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్‌కౌన్సెలింగ్‌ జరగనున్నట్లు కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్‌సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్యర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్‌కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని, సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలని అన్నారు.