ఒక కుటుంబమంతా 23 ఏళ్ల యువకుని మీద ఆధారపడి బ్రతికేది. ఆ వ్యక్తి తన చేతి నైపుణ్యంతో ఎన్నో కళాఖండాలు చెక్కితన కుటుంబాన్ని పోషించుకునేవాడు కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి చేయి చెక్క కోత మెషీన్‌లో పొరపాటున ఇరుక్కుపోయింది. చేతికి తీవ్రగాయాలు కావడంతో పాటుగా వేళ్లు తెగి పోయాయి. అతని ఎడమ చేయి మధ్య, ఉంగరం వేళ్లు కోతకు గురి కాగా, చూపుడు వేలు నలిగిపోయింది. తాను పనిచేసే పనికి చేతివేళ్లే ముఖ్యం. అవి లేకపోతే తాను ఏం చేయగలడు? తక్షణమే అతని సమస్యకు తగిన పరిష్కారం చూపగలిగే ఆరోగ్యకేంద్రం ఏదీ ఆయనకు దొరకలేదు.

ఈ నేపథ్యంలో అతనికి తెలిసిన వ్యక్తులు కొందరు మెడికవర్‌ హాస్పిటల్స్‌లో డాక్టర్‌ ఆర్‌ సునీల్‌ ను కలిస్తే ఫలితముంటుందని సూచించగా దానితో తక్షణమే అతనిని అతని కుటుంబసభ్యులు హైటెక్‌ సిటీ వద్దనున్న మెడికవర్‌హాస్పిటల్స్‌కు అతని చేతి నుంచి విరిగిపడిన వేళ్లను అతి జాగ్రత్తగా భద్రపరిచి అత్యవసర శస్త్రచికిత్స కోసం తీసుకువచ్చారు.

డాక్టర్‌ ఆర్‌ సునీల్‌ – కన్సల్టెంట్‌ హ్యాండ్‌ అండ్‌ రిస్ట్‌ సర్జన్‌, ఆర్థోపెడిక్‌ అండ్‌ ట్రౌమా సర్జన్‌ బృందం ఈ శస్త్రచికిత్సను చేసింది. అతని మధ్య, ఉంగరం వేళ్లను శస్త్రచికిత్స సమయంలో మైక్రోస్కోపిక్‌ ఖచ్చితత్త్వంతో తిరిగి అతికించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ శస్త్ర చికిత్స జరిగింది. తెగిపడిన వేళ్లకు రక్త సరఫరా పునరుద్ధరించడంతో పాటుగా ఎముకలు అతికించిన తరువాత నరాలు, కండరాలను కూడా సరిచేశారు.

శస్త్రచికిత్స తరువాత అతనిని అతి సన్నిహితంగా పరిశీలించడంతో పాటుగా ఎలాంటి దుష్పలితాలూ లేవనుకుని నిర్థారించుకున్న తరువాత అతనిని డిశ్చార్జ్‌ చేశారు. తెగి పడిన వేళ్లు, చేతిని అతికించడం అనేది అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స. దీనికి తగిన నైపుణ్యం కావాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే వారు త్వరగా తిరిగి తమ కార్యకలాపాలను నిర్వర్తించుకోవడం వల్ల అద్భుతమైన మానసిక ప్రయోజనమూ వారికి కలుగుతుంది.

డాక్టర్‌ ఆర్‌ సునీల్‌ మాట్లాడుతూ ”ఈ తెగిపడిన వేళ్లు పనికిరాని స్ధితిలో ఉన్నాయి కానీ అతి జాగ్రత్తగా, ఖచ్చితత్త్వంతో కూడిన శస్త్రచికిత్స చేయడం వల్ల వాటిని పునరుద్ధరించగలిగాము. ఈ రోగి పూర్తిగా కోలుకోవడంతో పాటుగా సంతృప్తి ఉండటం పట్ల మేము ఆనందంగా ఉన్నాము. చాలామందికి తెలియని అంశమేమిటంటే, తెగిపడిన వేళ్లను సైతం సమయానికి తీసుకువస్తే అతికించడం సాధ్యమే అని. సమయానికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల వేళ్లు యధావిధిగా పనిచేస్తున్నాయి” అని అన్నారు. మెడికవర్‌ వైద్యుల తోడ్పాటువల్ల తాను తన పనులకు యధావిధిగా వెళ్లగలనన్న నమ్మకం కలిగిందని ఆ యువకుడు ఆనందం వ్యక్తం చేసాడు.