తెలంగాణ ఆర్టీసీ ఒకప్పుడు నష్టాల్లో ఉండడంతో దానిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వెనక్కు తగ్గింది.

అలాంటి ఆర్టీసీకి సజ్జనార్ ను అధికారిగా నియమించిన తరువాత దాని రూపురేఖలు ఎప్పటి కప్పుడు మారుస్తూ ఎలాగైనా ఆర్టీసీని లాభాల బాటలో పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ విజయవంతంగా ముందుకు పోతున్నారు. దీనిలో భాగంగానే మరో ముందడుగు వేసి కొత్త సౌకర్యాన్ని ఆర్.టి.సి బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు కల్పించనున్నారు. అదేంటంటే..

మనం ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే డబ్బులు ఇచ్చి మాత్రమే టికెట్ తీసుకునే వాళ్ళం. డిజిటల్ చెల్లింపులు అనేవి ఉండేవికావు. కానీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా చిల్లర డబ్బులు సమస్య లేకుండా పోతుంది. దీనికోసమే క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా స్వైపింగ్ చెల్లింపులు చేయడానికి చర్యలు తీసుకుంటోంది.

కాకపోతే ఈ కార్డు హైదరాబాద్ నుండి వేరే జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ముందుగా అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ఆయా జిల్లాలకు ప్రతిరోజు 4000 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయి. అయితే వీటిలో కూడా 25% బస్సుల్లో కార్డు చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఆర్టీసీ ఖాతాలోకే డబ్బులు నేరుగా చేరుతాయి.

ఈ విధానాన్ని ఇప్పటికి బస్ పాస్ కేంద్రాల్లో కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆదాయం కొంతమేర పెరిగిందని, దీన్ని విద్యార్ధులతో పాటుగా ప్రయాణీకులకు కూడా అందుబాటులోకి తీసుకువస్తే ఆదాయం పెరిగే అవకాశాలుంటాయని అధికారులు అంటున్నారు. అలాగే దీని ద్వారా డబ్బులు డైరెక్ట్ గా ఆర్టీసీ ఖాతాలోకి చేరుకోవడం వల్ల జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవని తెలియజేస్తున్నారు.