అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా నిధి సమర్పణ అభియాన్ పేరుతో విరాళాల సేకరణ జరుగుతోంది. దేశ ప్రజలంతా కులమతాలకు అతీతంగా రామ మందిరానికి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ముస్లింలు కూడా మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వగా ఇప్పుడు క్రైస్తవులు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు.
కర్ణాటక క్రైస్తవులు అయోధ్య రామమందిరానికి రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డా.సీఎన్ అశ్వతనారాయణతో ఆ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజానికి చెందిన వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఎన్ఆర్ఐలు, సామాజికవేత్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము కూడా రామమందిర నిర్మాణంలో భాగమవుతామని చెప్పిన క్రైస్తవులు, తామంతా కలిసి కోటి రూపాయల విరాళం అందిస్తామని ప్రకటించారు.