రైతుల ఆందోళ‌న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా స‌చిన్ టెండుల్క‌ర్ స‌హా ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు చేసిన ట్వీట్ల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఒక‌సారి, ఒకే ర‌క‌మైన ట్వీట్ల‌ను సెల‌బ్రిటీలు చేయ‌డం వెనుక కేంద్ర ప్ర‌భుత్వం లేదా ఇంకెవ‌రి ప్ర‌మేయం ఉందా అనే అనుమానాల‌పై ద‌ర్యాప్తు జ‌రిపించ‌నున్న‌ట్లు మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రుగుతున్న‌ రైతుల ఆందోళ‌న‌ల‌పై పాప్ సింగ‌ర్ రిహ‌న్న‌, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త గ్రేటా థ‌న్‌బ‌ర్డ్ వంటి వారు స్పందించారు. రైతుల‌కు మ‌ద్ద‌తుగా వారు ట్వీట్ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వంపై ప‌లు ఆరోప‌ణ‌లు సైతం చేశారు. వీటిపై వెంట‌నే స‌చిన్ టెండుల్క‌ర్‌, విరాట్ కోహ్లి, అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, ల‌తా మంగేష్క‌ర్ వంటి ప్ర‌ముఖులు స్పందించారు. రెహ‌న్న‌, గ్రేటా ట్వీట్ల‌ను త‌ప్పుప‌ట్ట‌డంతో పాటు భార‌త అంత‌ర్గ‌త విష‌యాల్లో బ‌య‌టి వారి జోక్యం వ‌ద్ద‌ని గ‌ట్టిగా చెబుతూ ట్వీట్లు చేశారు.

త‌మ దేశ స‌మ‌స్య‌ల‌ను తాము ప‌రిష్క‌రించుకోగ‌ల‌మ‌ని, మీ ప‌ని మీరు చూసుకుంటే మంచిద‌ని కౌంట‌ర్ ఇచ్చారు. ఈ ట్వీట్ల‌పై మ‌హారాష్ట్ర‌లో అధికారం పంచుకుంటున్న శివ‌సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీ నేత‌లు మండిప‌డ్డారు. రైతులు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వానికి సెల‌బ్రిటీలు మ‌ద్ద‌తు ఇవ్వ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. ఇప్పుడు ఈ ట్వీట్ల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.