న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న దంత వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. దాదాపు ఏడు వేల సీట్లను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అర్హత మార్కులు ఎక్కవ ఉన్న కారణంగా చాలా సీట్లు మిగిలిపోయాయని, వాటిని భర్తీ చేసేందుకు అర్హత మార్కులు తగ్గించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్‌ దంత వైద్య కళాశాలల సంఘం సహా వేర్వేరు రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సోమవారం విచారించిన సుప్రీం కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. ఈ సీట్లను మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. అర్హత మార్కులు తగ్గించడం సహా ఈనెల 18 వరకు గడువు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా అర్హత మార్కులు తగ్గించాలని పిటిషనర్లు కోరగా.. ఇందుకు కేంద్రం అభ్యంతరం తెలిపింది. కాగా ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. అర్హత మార్కులను తగ్గించింది. జనరల్‌ కేటగిరీలో 10 శాతం, ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు 15 శాతం అర్హత మార్కుల శాతాన్ని తగ్గిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.