ఈ దశాబ్దంలోనే అతి తక్కువ రేట్లకి గృహ రుణ రేట్లు దిగిపోయాయి. దానికి కారణం ‘సాధారణ రుణ గిరాకీ ఆశించిన స్థాయి కంటే అతి తక్కువగా 6 శాతంలోపే ఉండటం, బ్యాంకుల దగ్గర సుమారు రూ.6.5 లక్షల కోట్లకు పైగా ద్రవ్య లభ్యత ఉండటం, గృహ రుణాల్లో నిరర్థక ఆస్తులు అతి తక్కువగా 1 శాతం లోపే ఉండటం’ అని కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. నిధులు ఇంత భారీగా బ్యాంకుల వద్ద వ్యర్ధంగా ఉంటె వాటి నికర లాభంపై ప్రభావం చూపుతుంది. డిపాజిటర్లకు ప్రస్తుత కనీస వడ్డీ అయిన 2.5 శాతం చెల్లించి అయినా బ్యాంకులు తమ వద్ద అధికంగా ఉన్న నిధుల్ని తక్కువ వడ్డీకి అయినా రుణంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలనుకుంటున్నాయి.

గృహ రుణాల్లో వృద్ధి 2020-21లో కరోనా కారణంగా తగ్గిపోగా, 2020 జనవరిలో 17.5 శాతంకు చేరుకొని, 2021 జనవరి నాటికి 7.7 శాతానికి తగ్గిపోయింది. ఈ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (ఎస్‌బీఐ) 0.67 శాతంగానే ఉన్నాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీకి కూడా 1 శాతం లోపుగానే ఉన్నాయి. గృహ రుణాలకు ఆస్తి పత్రాలు తనఖాగా ఉంటాయి కాబట్టి నష్టభయం కూడా తక్కువే! ఒకవేళ రుణగ్రహీత చెల్లించలేకపోయినా కూడా తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలంలో విక్రయించి నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. 2020 నవంబరు సమయానికి బ్యాంకులు అందించిన గృహ రుణాలు సుమారు రూ.14.17 లక్షల కోట్లుగా ఉన్నాయి.
కానీ కరోనా ప్రభావం వల్ల స్థిరాస్తి ధరలు తగ్గడం, కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న ఈ రంగాన్ని ఆదుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్‌ డ్యూటీ తగ్గించడం కూడా వినియోగదార్లకు ఆశక్తి కలిగించాయి. ఈ కారణాలన్నీ ఖాతాదార్లను ఆకర్షించేలా బ్యాంకులు నిర్ణయాలు తీసుకోడానికి దోహదం చేశాయి.

బ్యాంకు రేట్లు:

బ్యాంకు పేరుశాతం
 ఎస్‌బీఐ       6.70%
 ఐసీఐసీఐ బ్యాంక్‌  6.70%
హెచ్‌డీఎఫ్‌సీ   6.75%
 కోటక్‌ బ్యాంక్‌   6.65%
గృహ రుణ మార్కెట్‌ వాటా.. 
ఐసీఐసీఐ బ్యాంక్‌ 13%
 హెచ్‌డీఎఫ్‌సీ 19%
ఎస్‌బీఐ      34%