అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలు జరుపుకునే రోజు. ఏటా మార్చి 8 న గుర్తించబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఐడబ్ల్యుడి) సంవత్సరంలో ముఖ్యమైన రోజులలో ఒకటి గా చెప్పవచ్చు.


లింగ భేదాలకు అంతం పలికి మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలన్న ఆకాంక్ష చాల కాలం నుండి ఉంది. దానికి తగ్గట్టుగానే గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న నాయకత్వ మార్పుల్లో మహిళలకు సముచిత స్థానం దక్కిందని చెప్పవచ్చు.

కరోనా గత ఏడాది కాలంగా ఆర్ధిక, సాంస్కృతిక, రాజకీయ సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాలు కూడా కోవిద్ సవాలును స్వీకరించి దానికి ధీటుగా స్పందించాయి. ఆరోగ్య కార్యకర్తలుగా, స్వాస్థ్య ఉద్యమకారిణులుగా,వైద్య సేవలందించడంలో పని చేసి ప్రజా సమూహాలను ఎప్పటికప్పుడు చైతన్యపరిచి తెలివైన, చురుకైన నాయకురాళ్లుగా కరోనా కట్టడిలో మహిళలు పోషించిన పాత్ర మరువలేనిది.

ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోవడం, సమస్యలకు ధీటుగా జవాబివ్వడం, సమయానుకూలంగా స్పందించడం మహిళలకు పుట్టుకతో వచ్చే లక్షణం. ఓ మహిళా నీ సహనానికి, సౌశీల్యానికే, ధైర్యసాహసాలకు జోహార్