శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశాల నుంచి వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తీసుకొస్తున్న సుమారు రెండు కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విమానంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందగా అధికారులు రంగంలోకి దిగి
విమానం ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే తనిఖీలు మొదలు పెట్టగా ఒక సీటు కింద లైఫ్‌ జాకెట్‌లో దాచిన 2.3కిలోల బంగారం బిస్కెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ సీటులో ప్రయాణికుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

అలాగే కువైట్‌ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఒక ప్రయాణికుడు 160 గ్రాముల బంగారాన్ని తీసుకొస్తుంటే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడికి నోటీసులు జారీ చేసి పంపించారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.