విశాఖ స్టీల్ ప్లాంట్‌ గురించి కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణ తప్పదని స్పష్టం చేసింది. పార్లమెంట్ సాక్షిగా ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధమే లేదని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి వాటాలు కూడా లేవన్నారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై జగన్‌ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ఆమె పేర్కొన్నారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపహరించుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఏపీలో ఆందోళనలు ఉధృతముగా జరుగుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. విశాఖలో చేస్తున్న ఆందోళనకు మద్దతు కూడా ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ మావోయిస్టులు కూడా ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌పై తాజాగా కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటన రాజకీయ చర్చకు దారితీస్తోంది.