అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి అందరికి తెలిసిందే! కానీ ఇది ఎప్పుడు? దేని కోసం? ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా లేక నిరసనలు తెలిపే రోజా? దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. దానికి కారణాలు చదివి తెలుసుకోండి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైందంటే ఇది ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దానినే ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఏటా నిర్వహిస్తోంది.

దీనికి బీజాలు మాత్రం ఎప్పుడో 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ఒక ప్రదర్శన నిర్వహించగా, మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

ఈ రోజుని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన మాత్రం క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేయగా, 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. నిజానికి ఈ ఏడాది జరిగేది 109వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కానీ, 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక థీమ్ (ఇతివృత్తం)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ‘గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం’ అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. ఈ ఏడాది ”సమానత్వంతో ఆలోచించండి, తెలివిగా నిర్మించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి” అన్నది ఈ ఏడాది నినాదం.


సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. అలాగే పనిచేసే వయసున్న మహిళల్లో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి సర్వేలో బయటపడింది.నిజానికి కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించడమే ఈ దినోత్సవం వెనుక ఉన్న కారణం.

మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి అన్ని దానికి కూడా ఒక కారణం ఉంది.అది 1917 వ సంవత్సరం యుద్ధ సమయంలో రష్యా మహిళలు ”ఆహారం – శాంతి” డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నారు.