వివాహమైన తొమ్మిది నెలలకే ఓ యువతి అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. జీడిమెట్లకు చెందిన శైలజ (23)కు ఎస్పీఆర్‌హిల్స్‌ సమీపంలోని సంజయ్‌నగర్‌కు చెందిన డ్రైవర్‌ నవీన్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో అనుకున్న ప్రకారం
కట్న కానుకల కింద శైలజ తల్లిదండ్రులు 2 తులాల బంగారం, రూ.10 వేలు ఇవ్వలేకపోయారు. దీంతో పెళ్లైన మరుసటి రోజు నుంచే ఆమె అత్త తిరుపతమ్మ, భర్త నవీన్‌ శారీరకంగా, మానసికంగా హింసిస్తుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అత్తకు, భర్తకు నచ్చజెప్పి అత్తారింటికి పంపించడంతో మూడు వారాలుగా ఆమెకు మళ్లీ వేధింపులు మొదలై ప్రతిరోజూ కొట్టడం, దూషిస్తుండటంతో భరించలేని శైలజ మంగళవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అత్త, భర్తతో పాటు మరిది ప్రవీణ్‌ హత్య చేశారని, నిందితులను శిక్షించాలని మృతురాలి తండ్రి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు శైలజ అత్త తిరుపతమ్మను, భర్త నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిది ప్రవీణ్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు.వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.