కార్తీకమాసంలో యాదాద్రి నరసింహుడి ఖజానా భారీగా ఆదాయం ఆర్జించింది. 2020 కార్తీక మాసంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈసారి ఏకంగా రూ.1.60 కోట్లకు పైగా అధికంగా వచ్చింది. నవంబర్ 4న మొదలైన కార్తీకమాసం డిసెంబర్ 4న ముగిసింది. ఈ 30 రోజులలో భక్తులు నిర్వహించిన పూజల ద్వారా ఆలయానికి రూ.7 కోట్ల 35 లక్షల 10,307 ఇన్ కం వచ్చింది. అలాగే 2020 కార్తీక మాసంలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతాలతో పోల్చితే ఈసారి 3,416 వ్రతాలు ఎక్కువగా జరిగాయి. ఈ కార్తీక మాసంలో మొత్తం 19,204 మంది వ్రతాల్లో పాల్గొన్నారు. ఈసారి కేవలం సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారానే ఆలయానికి రూ.96.02 లక్షల ఆదాయం సమకూరింది.

యాదాద్రిలో ఆదివారం స్వామి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట పట్టింది. యాదాద్రిలో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో కొండపైకి భక్తుల వెహికల్స్​ను అనుమతించలేదు. కొండ కింద పాతగోశాల, రింగు రోడ్డులో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.22 లక్షల 69,332 ఆదాయం వచ్చింది.