జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల నమూనా రిజిస్ట్రేషన్‌ పత్రాలను గృహనిర్మాణ శాఖ ఏడు పేజీలతో రూపొందించింది. రిజిస్ట్రేషన్‌ వివరాలు, ఆస్తి సరిహద్దులు, ఇతర వివరాలను ఇందులో పొందుపరిచిపేదలకు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల పట్టాలను పొందిన లబ్ధిదారులకు యాజమాన్య హక్కు కల్పించేలా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్‌ తరఫున ఆయా మండలాల తహసీల్దార్ల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ పత్రాల కవర్‌పేజీపై సీఎం జగన్‌ ఫొటోతో పాటుగా గృహ నిర్మాణ శాఖ లోగోను ముద్రించారు. కవర్‌పేజీని నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. రిజిస్ట్రేషన్‌ చేయించటానికి తీసుకున్న స్టాంపు పేపర్‌, స్థల హద్దులను తెలిపే బాండ్‌ పేపర్లపై కూడా సీఎం ఫొటో, గృహనిర్మాణ శాఖ లోగోలను ముద్రించారు. ప్రతి పేజీ అడుగు భాగంలోనూ ముఖ్యమంత్రి ఫొటో ఉంది. 5వ పేజీలో రిజిస్ట్రేషన్‌ చట్టప్రకారం ఎగ్జిక్యూటెంట్‌ దగ్గర తహసీల్దారు ఫొటో, వేలిముద్ర.. అనుభవదారు స్థానంలో లబ్ధిదారు ఫొటో, వేలిముద్రలు ఉన్నాయి. హక్కుపత్రాలతో పాటు ‘అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, కుటుంబసభ్యులందరికీ నిండు మనసుతో రాస్తున్న ఉత్తరమిది’ అంటూ సీఎం రాసిన రెండు పేజీల లేఖను జత చేశారు.

పథకం లక్ష్యం, రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందనే వివరాలను లేఖలో ప్రస్తావిస్తూనే ఆఖరి కవర్‌ పేజీపై సీఎం జగన్‌, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోలు ముద్రించారు. కవర్‌ పేజీ మాదిరే దీన్ని కూడా నీలం, ఆకుపచ్చ రంగులతో రూపొందించారు.కానీ ఈ పథకం కింద రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు అందకపోవటం వల్లనే తహసీల్దార్లు గందరగోళంలో పడ్డారు.