అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మీద మరొకసారి వ్యాఖ్యలు చేసారు. ఆయన శనివారం ‘ది ఆస్ట్రేలియన్‌’ అనే వార్తా సంస్థకు చెందిన ఇన్వెస్టిగేటింగ్‌ ఎడిటర్‌ షెర్రీ మార్క్సన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ‘వాట్‌ రియల్లీ హ్యాపెన్డ్‌ ఇన్‌ వుహాన్‌’ అనే కార్యక్రమంలో భాగంగా 30 నిమిషాలపాటు పలు విషయాలను పంచుకొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాప్తి మొదలైన 2020 తొలి నాళ్లలో ‘వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ‘బయట బాడీ బ్యాగ్స్‌ కుప్పలు పడిఉన్నట్లు ఫొటోలున్నాయని, అప్పటికే పరిస్థితి ఘోరంగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చెప్పడం చెప్పారు కానీ ట్రంప్‌ దీనికి తగిన ఆధారాలను చూపించలేదు. అందరూ విన్న కథనాలే నేనుకూడా విన్నాను. వుహాన్‌ వీధుల్లో ప్రజలు పడిపోయి ఉన్నారని, బాడీ బ్యాగ్‌లు తెచ్చారని మీరంతా విన్నట్లే నేను కూడా విన్నానని ట్రంప్‌ వెల్లడించారు.

”ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి వ్యాపించి ఉంటుందని మన విచక్షణాజ్ఞానం చెబుతుంది. 95శాతం అదే నిజం కావచ్చు కూడా. వుహాన్‌ ల్యాబ్‌ వారికి చెడు ఉద్దేశాలు ఉన్నయా..? లేవా అన్నది నాకుతెలియదు. కావాలని కాకున్నా వారి అసమర్థత వల్ల కూడా బయటకు లీకై ఉండొచ్చు. కారణం ఏదయినా కానీ అది వుహాన్‌ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని అమెరికాలో చెబితే వారు వారు పిచ్చిగా ప్రవర్తించారు. అలా ఎందుకు ప్రవర్తించారో తెలియదు” అని వ్యాఖ్యానించారు.