ఇంట్లో ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండి చదువుకోవడానికి అనుకూలంగా ఉండే గదిని స్టడీ రూమ్ అంటారు. ఈ స్టడీరూమ్ లో చక్కని వాతావరణం తో పాటు ప్రశాంతత కూడా కావాలి.

పిల్లలు చదువుకునే గదిలో అలంకరణ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పిల్లల చదువుకునే సమయంలో ఏకాగ్రత పెరగాలంటే ప్రశాంత వాతావరణంతో పాటు గదిలోని రంగులు కూడా దోహదం చేస్తాయి. పిల్లల గదిలో సరైన రంగును ఎన్నుకోవడంతోపాటు స్టడీ రూమ్ అలంకరణ సమయంలో ఇతర విషయాలపై కూడా శ్రద్ధ చూపాలి. పెయింట్ రంగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి రూమ్ లోని రంగు గది వాతావరణాన్ని నిర్ణయిస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు చదువుకునే గదికి క్రీమ్ కలర్, లేత ఊదా, లేత ఆకుపచ్చ, నీలి ఆకాశం రంగు, లేత గులాబీ రంగులు మంచివి. ఈ రంగులు పిల్లల చదువుకునే సమయంలో మనసుని ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయి. ఈ రంగులు ఏకాగ్రత, మానసిక , మేథస్సుకు చిహ్నంగా పరిగణించబడతాయి. కనుక స్టడీ రూమ్‌కి ఈ రంగులను ఎంచుకోవడం వల్ల పిల్లల్లో మేధో సామర్థ్యం పెరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

స్టడీ రూమ్ కి ఎంచుకునే రంగులతో పాటు.. అలంకరణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముఖ్యంగా స్టడీ రూమ్ కోసం ఫోటోగ్రాఫ్‌లను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టడీ రూమ్‌ లో పెట్టే ఫోటోలు పిల్లల మనసుని ప్రశాంతంగా ఉంచేలా, వారిలో ఏకాగ్రత మరియు పట్టుదల పెరిగి చదువులో నిమగ్నమయ్యేలా చూసుకోవాలి.