సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్‌బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేష్‌బాబు భౌతికకాయాన్ని ఏఐజీ మార్చురీలో ఉంచి అనంతరం ఇంటికి తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేష్‌బాబుకు భార్య మృదుల, పిల్లలు భారతి, జయకృష్ణ ఉన్నారు.

రమేష్‌బాబు 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో బాలనటుడిగా నటించి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. కొంత విరామం తర్వాత నీడ చిత్రంతో వయసులో ఉన్న కుర్రాడి పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ చిత్రం అనంతరం కొన్నేళ్లు గ్యాప్‌ తీసుకొని సామ్రాట్‌ చిత్రంతో కథనాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ విరామం మధ్యలో డిగ్రీ పూర్తిచేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నా ఇల్లే నా స్వర్గం, అన్నా చెల్లెలు, పచ్చతోరణం, ముగ్గురు కొడుకులు, సామ్రాట్‌, చిన్ని కృష్ణుడు, కృష్ణగారి అబ్బాయి, బజార్‌ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్‌ టైగర్‌, ఆయుధం, కలియుగ అభిమన్యుడు చిత్రాల్లో నటించారు. చివరిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్‌కౌంటర్‌ చిత్రంలో నటించారు.

తండ్రి కృష్ణ, సోదరుడు మహేష్‌బాబుతో కలిసి పలు చిత్రాల్లో రమేష్‌బాబు నటించాడు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేష్‌బాబు 2004లో నిర్మాతగా మారి అర్జున్‌, అతిథి సినిమాలు నిర్మించారు. రమేష్‌బాబు మొత్తం 17 చిత్రాల్లో నటించారు. మొదటి నుంచి కథానాయకుడు కావాలని ఉన్నప్పటికీ డిగ్రీ పూర్తి చేశాకే సినిమాల్లోకి వచ్చేందుకు తన తండ్రి కృష్ణ నుంచి పూర్తి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లు రమేష్‌బాబు ఒక సందర్భంలో చెప్పారు. కథనాయకుడిగా ఎదగడానికి కుటుంబ సభ్యులందరూ ప్రోత్సహించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రమేష్‌బాబు మృతి పట్ల ఘట్టమనేని కుటుంబం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. రమేష్‌బాబు మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రేయోభిలాషులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దహన సంస్కారాల సమయంలో అభిమానులు గుమిగూడకుండా ఉండాలని విజ్ఞప్తి చేసారు.