దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి జరగాల్సిన యూపీఎస్‌సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. జనవరి 7 నుంచి 16 వరకూ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించేందుకు యూపీఎస్‌సీ షెడ్యూలు విడుదల చేసి ఏర్పాట్లూ పూర్తి చేసింది. కానీ కొవిడ్‌ కారణంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 19 మంది అభ్యర్థులు పిటిషన్‌ దాఖలుచేశారు.

దీనిపై వాదోపవాదాలు జరిగిన అనంతరం యూపీఎస్‌సీ తరఫు న్యాయవాది నరేశ్‌ కౌశిక్‌ వాదనలు వినిపిస్తూ ప్రిలిమ్స్‌ సమయంలోనూ ఇలాంటి పిటిషన్లే వచ్చాయని, సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం జస్టిస్‌ వి.కామేశ్వరరావు తీర్పు వెల్లడిస్తూ ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతున్నట్టు స్పష్టం చేశారు.