టెలికాం కంపెనీలు సెక్యూరిటీని పెంచే దిశగా చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా వాణిజ్య సందేశాల నియంత్రణ కోసం కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి తెచ్చారు. కానీ అక్కడే పెద్ద గందరగోళానికి తెర తీసినట్టయింది. నెట్‌బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, రైల్వే టికెట్ బుకింగ్, ఈ-కామర్స్, ఆధార్ ధ్రువీకరణ, కొవిన్ దరఖాస్తు వంటి ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రానికి దాదాపు 40శాతం సందేశాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఎస్ఎంఎస్, ఓటీపీ వంటి సందేశాలు వినియోగదారులకు చేరలేదు. టెలికాం కంపెనీలు అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలతో సాంకేతిక సమస్యలు తలెత్తడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఈ విషయంలో టెలికాం కంపెనీలు, పేమెంట్ సహా ఇతర సంస్థలు అన్ని పరస్పర ఆరోపణలు చేసుకుని, టెల్కోల తప్పిదం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేమెంట్ సంస్థలు ఆరోపించాయి. మరోవైపు కొత్త నిబంధనల్ని అమలు చేసే ప్రక్రియలో కంపెనీలు చేసిన తప్పిదమే అంతరాయానికి కారణమైందని టెల్కోలు ఆరోపించాయి. సందేశాలు పంపేవారి ఐడీలను కొత్తగా తీసుకొచ్చిన బ్లాక్‌చైన్ ప్లాట్‌ఫాంపై రిజిస్టర్ చేయకపోవడం వల్లే ఆ సందేశాలు అన్ని వెళ్లలేదని పేర్కొంటున్నాయి.
వాణిజ్య సందేశాల నియంత్రణకు ట్రాయ్ 2018లో కొత్త నిబంధనల్ని జారీ చేయడంతో సోమవారం నుంచి అవి అమల్లోకి వచ్చాయి. కొత్త నియమాల ప్రకారంగా టెలికాం కంపెనీలు ప్రతి ఎస్ఎంఎస్ను లక్షిత వినియోగదారుడికి పంపే ముందు రిజిస్టర్డ్ మెసేజ్‌తో సరిపోల్చి ధ్రువీకరించాలి. ఇందుకోసం టెలికాం ఆపరేటర్లు బ్లాక్‌చైన్ సాంకేతికతను అమల్లోకి తెచ్చారు. దీంట్లో రిజిస్టర్ అయిన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే ధ్రువీకరించుకొని వినియోగదారుడికి పంపుతారు. రిజిస్టర్ కాని ఐడీల నుంచి వచ్చే సందేశాల్ని నిలిపివేస్తారు. తద్వారా మోసాలు జరిగే ఆస్కారాన్ని తగ్గించవచ్చు.