ఈక్వటోరియల్ గినియాలో ప్రధాన నగరం బాటాలో ఉన్న సైనిక స్థావరంలో ఆదివారం పేలుళ్లు జరిగిన సంగతి పాఠకులకు తెలిసిందే! అక్కడ చోటుచేసుకున్న వరుస పేలుళ్ల కారణంగా మరణించినవారి సంఖ్య 98కి పెరిగింది. ఈ పేలుళ్లలో మరో 615 మంది గాయపడగా వారిలో 299 మంది ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.

సరైన భద్రతాప్రమాణాలు పాటించకుండా డైనమైట్లను నిల్వ చేయడం, సమీపంలోని రైతులు పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటివి పేలుళ్లకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ పేలుళ్ళలో మొదట 31 మంది మరణించారని భావించినా కానీ, వలంటీర్లు సోమవారంతా ఘటనా స్థలంలో వెతకగా ఇప్పటికి 98 మృతదేహాలను గుర్తించారు.ఈ పేలుళ్ల తరువాత ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి.

వాలంటీర్లకు ప్రమాద స్థలంలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలతో దొరికారు. వారిని ఆసుపత్రికి తరలించారు. నగరంలోని అన్ని భవనాలు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని దేశాధ్యక్షుడు టియోడొరో ఒబియాంగ్ గ్వీమా చెప్పారు. ”ఎన్‌కొయంటోమాలోని మిలటరీ బేస్‌కి చెందిన డైనమైట్లు, పేలుడు పదార్థాల నిల్వ కేంద్రం భద్రత వ్యవహారాలు చూసే విభాగం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది” అని అధ్యక్షుడు ఒబియాంగ్ ఈ సంఘటన పై ఒక ప్రకటనలో వెల్లడించారు.

సమీపంలోని రైతులు తమ పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెడుతున్నప్పుడు ఈ డైనమైట్ల నిల్వ కేంద్రానికి మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు. అధ్యక్షుడు ఒబియాంగ్ అంతర్జాతీయ సహాయాన్ని ఆయన కోరారు.