కృష్ణా జిల్లా గుడివాడలోని ఆర్‌సీఎం మిషనరీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన జరగడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. ప్రైమరీ స్కూల్లో దాదాపు 10 మంది విద్యార్థులు కళ్లు తిరిగిపడిపోయారు. బాధిత విద్యార్థులంతా 1, 2వ తరగతులు చదువుకుంటున్నారు. దాదాపు అంత మంది విద్యార్థులు ఒక్కసారిగా క్లాస్ రూంలోనే కుప్పకూలిపోవడంతో ఆందోళన నెలకొంది. దీనిపై వెంటనే అలర్ట్ అయిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రికి తరలించింది.


విద్యార్థులు ప్రస్తుతం మైకంలోనే ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అందరికీ సెలైన్ ఎక్కిస్తూ డాక్టర్లు అబ్జర్వేషన్‌లో ఉంచారు. కొందరు విద్యార్థులు కడుపు నొప్పితో విలవిల్లాడుతున్నారు. ఒక విద్యార్థి స్పృహలోకి రాగా, సిబ్బంది ట్యాబ్లెట్లు ఇచ్చారని, అవి తీసుకున్న వెంటనే మళ్లీ పడిపోయినట్లు తెలుస్తోంది.

అయితే, విద్యార్థులు ఇళ్లలో టిఫిన్ చేసి స్కూలుకు వచ్చారని.. పైగా స్కూల్లో కూడా లంచ్‌కు ముందే ఇలా జరిగిందని, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం లేదని టీచర్లు చెప్తున్నారు. ఆస్పత్రిలోనే ఉలిక్కిపడి లేవడం, కేకలు వేయడం చేస్తున్నట్లు పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓవైపు కరోనా భయం కూడా తల్లిదండ్రులను వెంటాడుతోంది. విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణాలపై డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. విద్యార్థులు కోలుకోని అసలు విషయం చెప్తేగానీ మిస్టరీ వీడే అవకాశం లేదు.

చిన్నారులంతా వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. పిల్లలకు మత్తు లక్షణాలు తప్ప మిగతా అంతా బావున్నట్లు చెప్పారన్నారు. బయట నుంచి తీసుకొచ్చిన ఆహారం ఏమైనా తిన్నారా? అనే దానిపై కూడా విచారణ చేస్తున్నామని మంత్రి తెలిపారు. చిన్నారుల అందరిని క్షేమంగా ఇంటికి పంపించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. చిన్నారులు తాగిన వాటర్, తిన్న బిస్కెట్లు, చాక్లెట్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపామని, అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి కొడాలి నాని వివరించారు. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న గుడివార ఎమ్మెల్యే హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్, ఎస్పీ కూడా ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.