బీఆర్కే భవన్‌ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలకు
కీలక హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయలేదు కానీ కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు కీలక విషయాలను వెల్లడించారు. ఏపీలో జగన్ సర్కారు 27 శాతం పీఆర్సీ ఇచ్చిందని, అంతకంటే ఎక్కువే ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు.

ఉద్యోగులకు 7.5 శాతం పీఆర్సీ ఇస్తారని గతంలో వార్తలు వెలువడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. 2018 జులై నుంచి పీఆర్సీ అమలు పెండింగ్ లో ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, స్పందించిన సీఎం తమ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేయబోదనీ, ఉద్యోగుల పదవీ విరమణ పెంపు విషయంలో సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉండటం కారణంగా సీఎం ప్రకటన చేయడం లేదు కానీ రాష్ట్రంలోని ఉద్యోగులు ఆందోళన చెందడం ఇష్టం లేక ఈ విషయాలను వెల్లడిస్తున్నామని సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.