మంగళవారం కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 50,714 వద్ద మరియు నిఫ్టీ 15,049 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. మంగళవారం ఉదయం 9:42 గంటల సమయానికి సెన్సెక్స్‌ 423 పాయింట్లు ఎగబాకి 50,864 వద్ద కొనసాగుతుంటే, నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 15,084 వద్ద ట్రేడవుతోంది.

ఆసియా మార్కెట్లు పూర్తి లాభాల్లో పయనిస్తున్నాయి. సోమవారం ఇంట్రాడేలో గరిష్ఠాన్ని తాకిన అమెరికా సూచీలు టెక్‌ షేర్ల అమ్మకాలతో నష్టాల్ని చవిచూశాయి. దీంతో ఫిబ్రవరి 12నాటి జీవితకాల గరిష్ఠాల నుంచి అక్కడి సూచీలు 10.6 శాతం వెనకపడ్డాయి. మరొక వైపు చమురు ధరలు సోమవారం కాస్త చల్లబడ్డాయి. ఈ పరిణామాలు నేడు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, యుటిలిటీస్‌ మినహా నిఫ్టీలోని దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే పయనిస్తున్నాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. భారత్‌ పెట్రోలియం, ఓఎన్‌జీసీ, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, ఐవోసీఎల్, యూపీఎల్‌ ‌షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.