పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో స్ట్రాండ్ రోడ్‌లోని కొత్త కోయిలాఘాట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రైల్వే కార్యాలయాలు ఉన్న భవనంలోని 17వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడకు చేరుకున్న పది అగ్నిమాపకదళ వాహనాలు మంటలను అదుపు చేశాయి.

భవనంలోని 17వ అంతస్తులో తూర్పు, ఆగ్నేయ రైల్వే జోన్లకు చెందిన కార్యాలయాలున్నాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతులలో ఇద్దరు ఆర్ఫీఎఫ్ జవాన్లు, ఒక ఎస్ఐ, నలుగురు అగ్నిమాపకదళ సిబ్బంది ఉన్నారు.

సమాచారం తెలియగానే సీఎం మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. అగ్ని ప్రమాదం సంభవించిన ఆ భవనంలోని అన్ని అంతస్తుల్లో ఉన్నవారు అందరిని తక్షణమే ఖాళీ చేయించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా వివరాలు తెలియవలసి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.