బంగ్లాదేశ్‌లో తొలిసారిగా 29 ఏళ్ల తశ్‌నువా అనాన్ శిశిర్ అను ట్రాన్స్‌జెండర్ టీవీలో సోమవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో మూడు నిమిషాల వార్తలు చదివారు. బంగ్లాదేశ్‌లో సుమారు 15 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వారు అందరు కూడా వివక్షకు, హింసకు గురవుతున్నారు. మనుగడ కోసం వారిలో చాలామంది సెక్స్ వర్కర్లుగా మారడమో అడుక్కోవడమో చేస్తున్నారు. బలవంతపు వసూళ్లకు కూడా పాల్పడుతుంటారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం 2013లో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక జెండర్‌గా గుర్తించింది. అయిదేళ్ల తరువాత వారికి ఓటు హక్కు కూడా కల్పించింది. తాను కూడా మానసిక వేధింపులకు, లైంగిక హింసకు గురయ్యానని శిశిర్ అన్నారు. ‘నా తండ్రి కూడా నాతో మాట్లాడటం మానేశార’ని చెప్పారు.

“నేను నా చదువును నమ్ముకున్నాను. కెరీర్ మీద దృష్టి పెట్టాను. ఇవాళ నాకు ఒక అవకాశం లభించింది” అని తశ్‌నువా బీబీసీతో అన్నారు. ఇంటి నుంచి పారిపోయిన శిశిర్ రాజధాని ఢాకాలో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. కానీ, చదువు ఆపలేదు. పబ్లిక్ హెల్త్‌లో ఎంఏ పూర్తి చేశాక టీవీ ఛానెళ్లలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. బైశాఖి అనే ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ మాత్రమే శిశిర్‌కు న్యూస్ యాంకర్‌ ఉద్యోగం ఇచ్చింది.

ఆ చానల్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, ‘ఇది చరిత్రాత్మక సందర్భం అని ఇది కొంతమంది ప్రేక్షకులకు ఆగ్రహం కలిగించినా కానీ మా చానల్ మాత్రం ఆ మాటకు కట్టుబడి ఉంది’ అని అన్నారు.వార్త చదివిన తరువాత తశ్‌నువా శిశిర్ భావోద్వేగానికి గురయ్యి గట్టిగా ఏడ్చారు.

చిన్నప్పుడు తాను ఇలా ఎందుకున్నానని బాగా కోపం వచ్చేదని, ఇప్పుడు ఎల్జీబీటీల్లో వార్తలు చదివిన మొదటి వ్యక్తిని కావడం గర్వంగా ఉందని శిశిర్ న్నారు. శిశిర్ ఇప్పుడు రెండు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు.