ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు తన రాజీనామా లేఖను ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్యకు మంగళవారం సమర్పించినట్లు సమాచారం. దీనితో ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సోమవారం నాడు ఢిల్లీ వెళ్లిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ బీజేపీ కీలక నేతలను కలేసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి గమనిస్తే బీజేపీ అధిష్టానం సూచనల మేరకు త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి తప్పుకుని, తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించేందుకు డెహ్రాడూన్ వెళ్లారని సమాచారం.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా లేఖను డెహ్రాడూన్‌లో గవర్నర్‌కు సమర్పించిన అనంతరం బీజేపీ సీనియర్ నేత త్రివేంద్ర సింగ్ రావత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని, ఉత్తరాఖండ్ ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలూపుతూ, సీఎం పదవికి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను సైతం గవర్నర్‌కు సమర్పించినట్లు తెలిపారు. అయితే ఉత్తరాఖండ్ తరువాతి సీఎం ఎవరు విషయాన్ని మాత్రం రావత్ వెల్లడించలేదు కానీ తన తరువాత ఈ కీలక పదవి చేపట్టనున్న నేతకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అయితే సీఎం పదవికి ఇద్దరు సీనియర్ నేతలు అయిన అజయ్ భట్, అనిల్ బలూనిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇంకా పార్లమెంట్ సభ్యులుగానే కొనసాగుతున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామాతో ఈ ఇద్దరు కీలక నేతలకు ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం అవకాశం ఇవ్వనుందని ఆ రాష్ట్రంలో చర్చ
మొదలైంది.