వార్తలు (News)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ – మిన్నంటిన నిరసనలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన సమాధానంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా కోపంతో మండిపడ్డారు. అప్పటి నుండి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది.ఈ ఆందోళనల్లో కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను అగ్నికి ఆహుతి చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ ఉక్కు ..ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంపీలంతా రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు.

పరిశ్రమ వద్దకు వచ్చిన డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వాహనాన్ని నిరసనకారులు చుట్టుముట్టి అడ్డుకున్నారు. ఈ తరుణంలో నిరసన కారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగాయి.
గాజువాక పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బందికి ఆలస్యం కావడంతో పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది చేరవేతకు 80 బస్సులు ఏర్పాటు చేశారు. కార్మికుల ఆందోళనతో గాజువాక, అగనంపూడి పరిసరాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దారిమళ్లింపుతో పీవోలు, ఏపీవోలు సకాలంలో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ను అనేక ఉద్యమాలతో సాధించుకున్నామని, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైన పరిశ్రమ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆర్థికపరంగా, ప్రజల మనోభావాలకు సంబంధించి స్టీల్‌ ప్లాంట్‌ ప్రత్యేకత చాటుకుందని వివరించారు. పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించడంతో సీపీఐ ఆందోళనలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ ముందు నుంచీ హెచ్చరిస్తూనే వచ్చిందన్నారు. పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించడంతో సీపీఐ ఆందోళనలు చేస్తోందన్నారు. కేవలం ఉత్తరాలతో న్యాయం జరగదని చెప్పినా సీఎం జగన్‌ పెడచెవిన పెట్టారని విమర్శించారు. సీఎం తన పార్లమెంట్‌ సభ్యులతో ఒకమాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతున్నారని, ఉక్కు పరిశ్రమ నిర్ణయంపై సీఎం నైతిక బాధ్యత వహించాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.