కృత్రిమ గుండె తయారీపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కాలేజీలోని సెంటర్‌ ఫర్‌ ప్రోడక్ట్‌ డిజైన్‌ డెవలఫ్‌మెంట్‌ ఆడిటివ్‌ మేనేజ్‌మెంట్‌ (సీపీడీడీఏఎం), ఉస్మానియా మెకానికల్‌ ఇంజ నీరింగ్‌ విభాగాలు సంయుక్తంగా ఈ పరిశోధన చేస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఎముకలు, దంతాలు, మోకాలి చిప్పలు, ఏరోస్పేస్, ఆటోమొబైల్‌ వస్తువుల తయారీలో ఇప్పటికే అనుభవం సంపాదించడంతో పరిశోధకులు ప్రస్తుతం కృత్రిమ గుండె తయారీపై దృష్టి సారించారు.

గుండె ఆకృతి రూపకల్పనకు సంబంధించిన కార్యకలాపాలు ఇప్పటికే 50 శాతం పూర్తి చేశారు. మరో 6 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ తయారుచేసిన గుండె పనితీరును ముందు జంతువులపై ప్రయోగించి ఆశించిన ఫలితాలు వచ్చిన తర్వాతే మానవులకు అమర్చనున్నారు. ఇప్పటికే అమెరికాలో కృత్రిమ గుండెను తయారు చేశారు. దానికి అమర్చిన బ్యాటరీ బరువు రెండున్నర కేజీలకుపైగా ఉంది. బ్యాటరీ బరువును 500 గ్రాములకు తగ్గించారు. గుండెకు సమీపంలో ఛాతీ లోపలే బ్యాటరీ అమర్చే వెసులుబాటును కల్పించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.